Advertisement
ప్రధానిగా రెండు పర్యాయాల తర్వాత మోడీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు రాగానే.. అందరూ అటు దిక్కే చూశారు. పైగా ఈసారి త్రిముఖ పోరు నెలకొనడంతో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ కనిపించింది. కానీ, వార్ వన్ సైడ్ లా మారింది. బీజేపీ దెబ్బకు ప్రధాన పార్టీలు విలవిలలాడాయి. ఆరుసార్లు వరుసగా గెలిచిన బీజేపీకి మరో ఛాన్స్ ఇవ్వకుండా చేద్దామనుకున్న కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యారు. గతం కంటే భిన్నంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ 156 స్థానాల్లో విజయఢంకా మోగించగా.. హస్తం పార్టీకి కేవలం 17 సీట్లే వచ్చాయి. ఇక ఉచితాల పేరుతో పంజాబ్ స్ట్రాటజీని గుజరాత్ లో అమలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు గుజరాతీలు. కాకపోతే ఆ పార్టీకి ఓట్ల శాతం సంతృప్తినిచ్చే అంశం.
Advertisement
బీజేపీ గెలుపుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందని అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందని.. ఇందుకు ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతోనే తిరిగి గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ లో బీజేపీ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే… మోడీ ఇచ్చిన కొత్త నినాదం కీలక పాత్ర పోషించింది. ‘గుజరాత్ ను నేనే తీర్చి దిద్దాను’ అనే నినాదం ప్రజల్లోకి బాగా దూసుకుపోయింది. ఇది ఓటర్లను బాగా ఆకట్టుకుంది. బీజేపీకి వేస్తే ఓటు మోడీ ఖాతాలో పడుతుందన్న నినాదంతో ఓటర్లలో సెంటిమెంట్ ను రగిలించారు. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ నినాదాన్ని వినిపించింది. హిందూ వర్గాన్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలోనూ ప్రయత్నం చేసింది. ద్వారకాను పశ్చిమ భారత్ లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని హామినిచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ కృష్ణుడి విగ్రహం, త్రీడీ భగవద్గీత ఎక్స్ పీరియెన్స్ జోన్ తో పాటు గ్యాలరీ నిర్మాణం చేపడతామంటూ పలు హామీలు ఇచ్చింది. దీంతో హిందువులు బీజేపీ వైపు మొగ్గు చూపారు.
Advertisement
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆప్ అన్ని విధాలా కృషి చేసింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 2017 ఎన్నికల్లో ఆప్ అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కానీ, ఈసారి ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అనేక నియోకవర్గాల్లో బీజేపీకి లబ్ది చేరింది. దాని ఫలితంగానే రికార్డ్ స్థాయిలో సీట్లు వచ్చాయి. అలాగే ఎంఐఎం పోటీ కూడా బీజేపీకి లాభించింది. దీనికితోడు వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం.. వారి స్థానంలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం చేసింది బీజేపీ. ఈసారి 62 మంది కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించింది. టికెట్లు రాని వారిలో అనేకమంది మంత్రులు కూడా ఉన్నారు. అయితే.. రెబెల్స్ బెడద పార్టీపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ప్రచారంలో కాంగ్రెస్ చాలా వెనుకబడడం కూడా బీజేపీకి లాభం చేకూర్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టలేకపోయింది. రాహుల్ గాంధీ ఒకటి రెండు సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆయన ఎక్కువగా జోడో యాత్రపైనే దృష్టి పెట్టారు. అటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇక కీలకమైన పాటిదార్లు, దళితులు, గిరిజనుల ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల ఎంపిక బాగా కలిసొచ్చింది.