Advertisement
మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దీన్ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో మైండ్ స్పేస్ దగ్గర ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత పునాది వేశారు. అక్కడి నుంచి అప్పా కూడలిలోని పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
భవిష్యత్ లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని ప్రకటించారు కేసీఆర్. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. చేసి తీరుతామని స్పష్టం చేశారు. అద్భుతమైన నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందన్నారు. పచ్చదనంలో పురోగమించామని.. వరల్డ్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు మనకే రావడం జరిగిందని తెలిపారు. ఎంత చేసినా ఇంకా తక్కువేనని.. లక్షల సంఖ్యలో హైదరాబాద్ జనాభా పెరుగుతోందన్నారు. దానికి తగిన రీతిలో మురుగు నీరు, మంచి నీటి సదుపాయాలు కల్పించుకోవాలని చెప్పారు.
హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చినట్లు చెప్పిన సీఎం.. న్యూయార్క్, లండన్, పారిస్ నగరాల్లో కరెంట్ పోయినా ఇక్కడ మాత్రం పోదన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. అన్ని మతాలు, కులాలు, జాతులను అక్కున చేర్చుకున్న హైదరాబాద్.. విశ్వనగరంగా మారుతుందని చెప్పారు. ఇక్కడ సమశీతల వాతావరణం ఉండటం వలన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసించేందుకు ఇష్టపడతారని తెలిపారు కేసీఆర్.
Advertisement
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సుమారు రూ.6,250 కోట్లతో ఈ పనులను పూర్తి చేయాలని చూస్తోంది. ఈ మార్గం త్వరగా విమానాశ్రయానికి వెళ్లడానికి సహాయపడనుంది. మొత్తం 9 స్టేషన్లను ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 26 నిమిషాల్లో చేరుకోవచ్చు. మూడేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. ఆకాశ మార్గం 27.5 కిలో మీటర్లు ఉండగా.. భూమిలో నుంచి కిలో మీటర్ మేర నిర్మించనున్నారు.
అయితే.. మూడేళ్లు టార్గెట్ పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే.. 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెట్రో భవన్ కు శంకుస్థాపన చేశారు. 2010న మెట్రో ఒప్పందం, అగ్రిమెంట్ జరిగింది. ఐదేళ్లలో మొదటి దశ పనుల్ని పూర్తిచేయాలని అనుకున్నారు. 2014 డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నా ఆలస్యమైంది. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో 2017 నవంబర్ లో నాగోల్ – అమీర్ పేట్ – మియాపూర్ మార్గం ప్రారంభమైంది. తరువాత ఎల్బీ నగర్ – అమీర్ పేట మార్గం 2018 అక్టోబర్ లో, అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం 2019 మార్చిలో, జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గం 2020 ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ఐదేళ్లకు అనుకుంటే.. ఏడేళ్ల సమయం పట్టింది.. ఆ తర్వాత మిగిలిన మార్గాలు కూడా ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు ఎయిర్ పోర్టు మార్గానికి మూడేళ్లు టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. మరి.. ఇది అనుకున్న సమయానికి పూర్తవుతుందో లేదో చూడాలి.