Advertisement
ఈమధ్య తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. 2014కు ముందు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ తరఫున పాదయాత్ర చేసిన ఈమె.. తెలంగాణ కొత్త పార్టీ పెట్టుకుని జనాల్లోకి వెళ్లారు. మొదట్లో నిరుద్యోగుల సమస్యలే అజెండాగా దీక్షలు నిర్వహించి.. తర్వాత ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ.. అధికార టీఆర్ఎస్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు తరచూ అడ్డుకుని దాడులకు తెగబడుతున్నారు.
Advertisement
వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా పెద్ద రచ్చే జరిగింది. షర్మిల బస చేసే బస్సును తగులబెట్టారు గులాబీ శ్రేణులు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె కారులో ఉండగానే పోలీసులు వాహనాన్ని లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ రాజకీయంగా వైటీపీకి మైలేజ్ తీసుకొచ్చింది. ఏకంగా ప్రధాని మోడీ నుంచి షర్మిలకు ఫోన్ వచ్చేలా చేసింది. అయితే.. ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించాలని షర్మిల ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు.
Advertisement
ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ పోలీసులు మరోసారి అనుమతిని నిరాకరించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నాక.. యాత్రకు అనుమతి ఇవ్వాలని వైటీపీ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం.. కొన్ని షరతులతో యాత్రకు ఓకే చెప్పింది. కానీ, పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో మరోసారి షర్మిల పోలీసుల అనుమతి కోసం ధరఖాస్తు చేసుకోగా దానిని కూడా తిరస్కరించారు. దీనికి నిరసనగా షర్మిల దీక్షకు దిగారు.
పోలీసులు అనుమతి నిరాకరించడంపై దీక్ష ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్దకు వైటీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. కనీసం మూడు రోజులు లేదా అనుమతి ఇచ్చే వరకు షర్మిల దీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన తెలిపారు. విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. చూడాలి.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి.