Advertisement
మీరంతా ఆర్జీవీ సినిమాలు చూసే ఉంటారు. ఇప్పుడంటే అట్టర్ ఫ్లాప్స్ తీస్తున్నాడు గానీ.. ఒకప్పుడు అతని రేంజ్ వేరు. అయితే.. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వెలుగుచూసిన కేసు.. అద్భుతమైన టేకింగ్, ట్విస్టులతో సాగే ఆర్జీవీ సినిమాలాగే ఉంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ లా సాగుతున్న ఈ కేసులో కొత్త కొత్త విషయాలెన్నో బయటపడుతున్నాయి.
Advertisement
అసలు ఏం జరిగింది..?
శుక్రవారం దాదాపు 100 మంది మన్నెగూడలోని ఓ ఇంట్లోకి చొరబడ్డారు. రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డొచ్చిన వారిని కొట్టారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదనే కోపంతో నవీన్ రెడ్డి అనే వ్యక్తి యువతిని ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రులని బెదిరించాడు.
నవీన్ రెడ్డి వాదనేంటి?
హిందూ సంప్రదాయం ప్రకారం మాకు పెళ్లి జరిగింది. 2021 ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో వివాహం జరిగింది. డాక్టర్ కోర్స్ పూర్తయ్యే దాకా పెళ్లి ఫోటోలు బయటకు రావొద్దని యువతి కండిషన్ పెట్టింది. 2021 జనవరి నుంచి ప్రేమలో ఉన్నాం. యువతి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చుపెట్టించారు. పెళ్లి చేస్తామని మాట ఇచ్చి తప్పారు. నా డబ్బుతో వైజాగ్, అరకు, కూర్గ్, మంగుళూరు, గోకర్ణా, గోవాలకు వెళ్లారు. యువతి పేరు మీద ఓల్వోకారు, తండ్రికి రెండు కాఫీ షాపులు రిజిస్ట్రేషన్ చేయించా. ఆమె నా భార్య.
Advertisement
యువతి తల్లిదండ్రులు ఏమంటున్నారు?
నవీన్ రెడ్డిది దుష్ప్రచారం. మొదటి నుంచీ కుట్ర పన్నాడు. యువతి పేరుతో నకిలీ ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి వాళ్లిద్దరూ దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. దీనిపై ఆదిభట్ల పీఎస్ లో అక్టోబర్ లో కేసు నమోదు చేశాం. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఫేక్ ఇన్ స్ట్రాగ్రామ్ కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాం. నిందితుడు నవీన్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన రఘుమారెడ్డి, మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవీన్ రెడ్డి సైకోగా వ్యవహరించాడు. బ్యాడ్మింటన్ కోర్టు వద్ద మా అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెని సొంతం చేసుకునేందుకు ఎన్నో డ్రామాలు ఆడాడు. పెళ్లయినట్లు నమ్మించేందుకు కుట్ర చేశాడు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా పేరు రాయించాడు. ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్ వేశాడు. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడు. ఆ సమయంలో మా అమ్మాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి.
నిందితులపై కేసు నమోదు
యువతి తండ్రి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా నవీన్ రెడ్డి, అతని అనుచరులపై పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నవీన్‌రెడ్డితో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.