Advertisement
ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకూ గళమెత్తి తమ వైఖరి చెప్పే అవకాశం ఉంది. ప్రతిపక్షంలోని నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అప్పుడప్పుడు వారి యాత్రల్లో, సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరుగుతుంటాయి. తర్వాత యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. కానీ, వైటీపీ అధ్యక్షురాలు షర్మిల విషయంలో మాత్రం తేడాగా జరుగుతోంది.
Advertisement
షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోలీసులు ప్రజాప్రస్థానం కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆఖరికి హైకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. కావాలని షర్మిలకు హైప్ తీసుకొస్తున్నారన్న వాదన కూడా ఉంది. రోజురోజుకీ షర్మిలకు పెరుగుతున్న క్రేజ్ కారణంగా ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. ఆమె తండ్రి కాంగ్రెస్ వాది కావడంతో ఆయన మీదున్న అభిమానం ఈమె వైపు షిఫ్ట్ అయితే.. హస్తం పార్టీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే షర్మిలకు కేసీఆర్ హైప్ తీసుకొస్తున్నారా? అనే అనుమానాలు ఉన్నాయి.
Advertisement
పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగారు షర్మిల. ముందుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చున్నారు. కానీ, పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. కానీ, ఆమె మాత్రం రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. తర్వాత దీక్షా వేదిక ఏర్పాటు చేయడంతో అక్కడకు షిఫ్ట్ అయ్యారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ.. ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. అయితే.. అర్థరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే.. ముందు ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి షర్మిల నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో ఆమె తల్లి విజయలక్ష్మి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తెల్లవారు జామున షర్మిల ఆసుపత్రిలో చేరారని, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, బలహీనతతో అడ్మిట్ అయ్యారని చెప్పారు. షర్మిలకు డీ హైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని చెప్పారు. అలాగే తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ రీనల్ అజోటెమియా కూడా ఉందని వివరించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాకపోతే రెండు, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరి.. డిశ్చార్జ్ అయ్యాక షర్మిల ఏం చేస్తారో చూడాలి.