Advertisement
అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. చదవుకోలేని పేద విద్యార్థులు ఎందరో. అలాంటివారికి వెన్నుదన్నుగా ఉంటూ ఆర్థికంగా అండగా ఉంటున్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పేద విద్యార్థులకు సాయం చేస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా ముగ్గురు మెడికల్ విద్యార్థులకు రూ.75వేల ఆర్థిక సహాయం చేశారు.
Advertisement
భాషాపక కళ్యాణి, కొరివి మహేష్, చెరుపల్లి నిహారిక ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వారి చదువు పూర్తయ్యే వరకు ఖర్చు అంతా భరిస్తానని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులోభాగంగానే రూ.75వేల సాయం చేశారు. ఈ ఏడాది 28మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించారు ఎంపీ వెంకట్ రెడ్డి.
కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరికి ఆర్థిక సాయం చేశారు. నార్కెట్ పల్లి మండలంలో ఇద్దరు యువకులకు అండగా నిలబడ్డారు వెంకట్ రెడ్డి. కొండపాకగూడేనికి చెందిన సాయితేజ కబడ్డీలో రాణిస్తున్నాడు. జాతీయస్థాయి జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఈనెల 9న మహారాష్ట్రలో జరిగే పోటీల్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే.. సాయితేజది నిరుపేద కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ.. ఆ యువకుడికి రూ.25వేలు సాయంగా అందించారు.
Advertisement
ఇక శాపల్లి గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు. తల్లిదండ్రులను చిన్న వయసులోనూ పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ దగ్గరే ఉంటూ పెరిగాడు. అయితే.. ఆమె కూడా ఈమధ్యే కాలం చేసింది. దీంతో మధు అనాధ అయ్యాడు. పదో తరగతి వరకే చదివిన మధు.. ఉన్నత చదువులు చదివే స్థోమత లేక కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మధు పరిస్థితి గురించి తెలిసిన వెంకట్ రెడ్డి అతడికి సాయం చేయాలనుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లి రూ.50వేలు అందించారు. అంతేకాదు ఇల్లు కూడా నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్థులకు అండగా నిలబడ్డారు వెంకట్ రెడ్డి. ఎంపీ సేవాగుణంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పేద విద్యార్థులకు ప్రతిభ గల వారికి ఆపన్నహస్తం అందిస్తుండడంపై నియోజకవర్గంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి సేవాగుణాన్ని కొనియాడుతున్నారు.