Advertisement
కాంగ్రెస్ ప్రక్షాళనలో భాగంగా అధిష్టానం శనివారం కీలక కమిటీలను ప్రకటించింది. అయితే.. అందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారో అని అందరూ చూస్తుండగా.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. ఢిల్లీలో హై పవర్ కమిటీలు చాలా వున్నాయని.. తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. పేదలు, కార్యకర్తలే తనకు ముఖ్యమని .. మంత్రి పదవికే రాజీనామా చేశానని గత విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందే రాజకీయాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు.
Advertisement
నల్లగొండ నియోజకవర్గం నుండి ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా బాధితులు, స్థానికులు తనకే ఫోన్ చేస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పారు. రైతులు సాగునీటి కష్టాలు కూడా తన దృష్టికి వస్తున్నాయని వాటిని కూడా పరిష్కరించానని అన్నారు. నియోజకవర్గానికి రెగ్యులర్ గా వస్తుంటానని.. అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీస్ లు కడుతున్నారన్న ఆయన.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ భవనాలు తన హయాంలో నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
Advertisement
తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మరువనని అందరికీ అందుబాటులో ఉంటానన్నారు వెంకట్ రెడ్డి. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు డ్రా తీసి ఇవ్వాలని.. టీఆర్ఎస్ వాళ్లకు మాత్రమే ఇస్తే న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 378 కోట్లతో రీటెండర్ వేయించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించామని.. నల్గొండలో వెంకటేశ్వర కాలనీలో కాపాడిన 100కోట్ల స్థలం ఆస్తిలో పార్టీ ఆఫీస్ ఏంటని అడిగారు. గుడి ఉన్న చోట పార్టీ ఆఫీస్ కట్టారన్న ఆయన.. తాను ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తానని తేల్చిచెప్పారు. వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని గుర్తు చేశారు.
రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం అభివృద్ధి కాదన్న కోమటిరెడ్డి… కేసీఆర్ చెప్పిన దత్తత మాటలు నిజమైతే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రస్తుతానికి తాను అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లోనే ఉంటానని.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. రెండు రాష్ట్రాలు కలపడం సాధ్యం కాదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు వెంకట్ రెడ్డి.