Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించారు. దాదాపు ఏడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కవిత ఇంటికి తరలివచ్చారు. ఆమెను పరామర్శించారు. అయితే.. కాసేపటికే ఆమె తన ఇంటి నుంచి ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో సమావేశమయ్యారు.
Advertisement
ఆదివారం 11 గంటలకు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు అధికారులు లోపలికి వెళ్లారు. ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. లిక్కర్ స్కాం కు సంబంధించి తమకు ఉన్న డౌట్స్ అన్నీ కవితను అడిగారు. ప్రత్యేకమైన గదిలో ఈ విచారణ కొనసాగింది. సాయంత్రం ఆరున్నర వరకు విచారించారు అధికారులు.
Advertisement
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. ఈక్రమంలోనే సీబీఐ నోటీసు ఇచ్చింది. ముందుగా ఓ డేట్ అనుకున్నా.. అది కుదరలేదు. 11 డేట్ ఫిక్స్ అయి.. 11 గంటలకు విచారణకు వచ్చారు అధికారులు. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
విచారణ ప్రక్రియ అంతా వీడియా రికార్డింగ్ ద్వారానే జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు కవిత సమాధానం ఇచ్చారని.. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత అడ్వొకేట్ ను బయటకు పంపి.. కవితను మాత్రమే విడిగా అధికారులు ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు.