Advertisement
భారత భూమిని ఆక్రమించేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉంది చైనా. సరిహద్దు ప్రాంతాల్లో చొచ్చుకొస్తూ రెచ్చగొడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. ఈ గొడవలో ఇరువైపులా కొంతమంది జవాన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘర్షణ అనంతరం శాంతిని నెలకొల్పేందుకు ఉన్న మెకానిజం ప్రకారం.. చైనీస్ కమాండర్ తో తవాంగ్ సెక్టార్ లోని ఇండియన్ ఆర్మీ కమాండర్ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపారు.
Advertisement
రెండేండ్ల క్రితం తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవ తర్వాత తరచూ సరిహద్దుల్లో రెచ్చగొడుతోంది చైనా. ఆరోజు గల్వాన్ గొడవలో మన జవాన్లు 20 మంది చనిపోయారు. చైనా మాత్రం మృతుల వివరాలు వెల్లడించకపోయినా.. 40 మందికిపైగా చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య మిలిటరీ కమాండర్ ల స్థాయిలో అనేక దఫాలుగా చర్చలు సాగాయి. మళ్లీ ఇన్నాళ్లకు అదే స్థాయిలో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Advertisement
తాజా ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. దౌత్యమార్గాల ద్వారా చైనా అధికారులతో చర్చించామన్నారు. ఘర్షణల్లో రెండు పక్షాల వారూ గాయపడ్డారు.. కానీ మన వైపున జవాన్లలో ఎవరూ మరణించడం లేదా తీవ్రంగా గాయపడడం జరగలేదని స్పష్టం చేశారు. భారత కమాండర్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో చైనా దళాలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు.
భారత భూ భాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులకు మన వాల్లు ధీటైన జవాబు ఇచ్చారని వెల్లడించారు రాజ్ నాథ్. వారు ధైర్యంగా అడ్డుకున్నారని తెలిపారు. భారత సరిహద్దులను కాపాడేందుకు బలగాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. అంతకుముందు లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవాంగ్ ఘర్షణపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినా విపక్షాలు వినిపించుకోకపోవడం సరికాదన్నారు.