Advertisement
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఓవైపు ఢిల్లీలో శాశ్వత భవనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంకోవైపు తాత్కాలిక ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే బీఆర్ఎస్ విజయవంతం కావాలని రాజశ్యామల యాగం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలు ఈ యాగంలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. 12 మంది రుత్వికులు గణపతి పూజతో శ్రీకారం చుట్టారు.
Advertisement
అయితే.. ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు కానీ.. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ మాత్రం వెళ్లలేదు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఆయన వెళ్లలేదని అంటున్నారు. మారుతి సుజుకీకి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో సమావేశం ఉంది. కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఈ బృందం హైదరాబాద్ వచ్చింది. అలాగే సలార్పురియా నాలెడ్జ్ పార్కులో Bosch ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ వల్లే కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని చెబుతున్నారు.
Advertisement
కానీ, రాజకీయ వర్గాల్లో మరో చర్చ సాగుతోంది. పార్టీ, ప్రభుత్వం పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలున్నాయనే ప్రచారం ఉంది. కొంత కాలం పాటు పార్టీ అధికారిక పత్రికలో కవిత వార్తలు కూడా కవర్ కాలేదు. దీంతో తెరపైకి అనేక అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత అంతా సర్దుకున్నట్లుగా ప్రచారం సాగింది. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కేటీఆర్ దూరంగా ఉండడంతో మరోసారి పాత విషయాలపై చర్చ జోరందుకుంది.
బీఆర్ఎస్ ప్రారంభోత్సవం సందర్భంగా కవిత ఒక రోజు ముందుగానే ఢిల్లీ వెళ్లారు. ఈమధ్యే బీఆర్ఎస్ గురించి ఆమే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ పెద్దగా స్పందించడం లేదు. జాతీయ రాజకీయాలను కవితకు.. తెలంగాణ రాజకీయాలు కేటీఆర్ కు అప్పజెప్పడం ద్వారా కేసీఆర్ వీరిద్దరి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించారని అందరూ అనుకుంటున్నారు. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి దూరంగా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.