Advertisement
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కమిటీల వివాదం కొనసాగుతున్న ఈ సమయంలో కోమటిరెడ్డి.. పార్టీ అధ్యక్షుడ్ని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Advertisement
కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్న దాని ప్రకారం… ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఖర్గేకు వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, నేతలు పార్టీ వీడటం, శశిధర్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు రాజీనామాలు చేయడం వంటి అంశాలను పార్టీ అధ్యక్షుడికి వివరించారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి సమావేశం జరిగింది.
Advertisement
అయితే.. రాజకీయ వర్గాల్లో మరో చర్చ సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పినా.. వెంకట్ రెడ్డి మాత్రం పార్టీనే నమ్ముకుని ఉండడంపై ఖర్గే ప్రశంసలు కురిపించారట. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో వెంకట్ రెడ్డికి ప్రాధాన్యత కల్పిస్తామంటూ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ స్థాయిలో కోమటిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తానని పార్టీ అధ్యక్షుడు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన వెంకట్ రెడ్డి.. వరుసగా ఏఐసీసీ నేతలను కలుస్తున్నారు. మంగళవారం రాత్రి తారీక్ అన్వర్ తో భేటీ అయ్యారు. షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. అలా.. ఖర్గేను కూడా కలిసి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు దక్కకపోయినా జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తానని ఖర్గే హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.