Advertisement
ఏపీలో సంచలనం రేపిన కేసుల్లో కోడికత్తి దాడి ఒకటి. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన ఈ దాడిపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. సెల్ఫీ కోసం వచ్చి జగన్ పై శ్రీను అనే యువకుడు ఎయిర్ పోర్టులో కోడి పందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి చిన్న గాయమైంది. దాడి తర్వాత శ్రీనుని అరెస్ట్ చేశారు. అక్కడే క్యాంటీన్ లో ఇతను పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇతను జగన్ అభిమాని అని.. సానుభూతి రావడం కోసం ఇదంతా చేశాడని పోలీసులు తేల్చారు. కానీ, వైసీపీ నేతలు దీన్ని ఖండిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Advertisement
ఈ కేసును ముందు సిట్ దర్యాప్తు చేసింది. ఆ తర్వాత ఎన్ఐఏకి అప్పగించారు. 2019లో చార్జిషీట్ దాఖలు అయింది. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ కేసు కోర్టులో విచారణకు రావడం లేదు. ఓసారి శ్రీనుకి బెయిల్ వచ్చింది. కానీ, ఎన్‌ఐఏ కొట్టి వేయించింది. దీంతో అప్పటి నుండి అతను జైల్లోనే ఉంటున్నాడు. తమ కుమారుడ్ని విడిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా లేఖ రాశారు శ్రీను తల్లిదండ్రులు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఏళ్లు గడుస్తున్నా జైల్లోనే మగ్గుతున్నాడు.
Advertisement
సీన్ కట్ చేస్తే… వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హత్యకేసులో అరెస్ట్ అయిన అనంతబాబు.. తాజాగా బెయిల్ పై బయటకు రావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను విషయాన్ని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అతనికో న్యాయం.. ఇతనికో న్యాయమా అని నిలదీస్తున్నారు.
మే 19వ తేదీన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకెళ్లిన అనంతబాబు.. రొడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ అదే రోజు మృతదేహాన్ని తీసుకొచ్చి వదిలేశాడు. అయితే, సుబ్రహ్మణ్యం బంధువులు అక్కడే అనంతబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అందర్నీ బెదిరించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అనంతబాబును అరెస్ట్ చేశారు. తానొక్కడినే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంగీకరించాడు. అరెస్ట్ అయిన దగ్గర నుంచి బెయిల్ పై బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. మే 23 నుంచి 211 రోజులుగా సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు.
ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపిన అనంతబాబు బెయిల్ పై బయటకు రావడం ఏంటి..? అది కూడా 211 రోజులకే. మరి.. శ్రీను ఇంకా ఎన్నేళ్లు జైల్లోనే ఉండాలని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.