Advertisement
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల మక్కువతో.. దేశాన్ని ఏలుదామని ఢిల్లీలో తాత్కాలిక ఆఫీస్ ను తెరిచారు. కిసాన్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. రైతు రాజ్యం తీసుకొస్తామనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంత హడావుడి జరుగుతున్నా కూడా తన మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ సైలెంట్ గా ఉండడం పట్ల అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.
Advertisement
కావాలనే ఎంఐఎంను కేసీఆర్ దూరంగా ఉంచారని కొందరు. లేదు లేదు.. జాతీయ పార్టీగా అవతరించాలని చూస్తున్న ఎంఐఎం పార్టీనే బీఆర్ఎస్ తో గ్యాప్ పెంచుకుంటోందని మరికొందరు ఇలా అనేక కథనాలు అల్లేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించాలంటే చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ పోరాటంలో ఎంఐఎం ఓ అడుగు ముందుకే ఉంది. పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తూ సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకుంటోంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే బాటలో పయనించాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం గ్యాప్ మెయింటెన్ చేస్తున్న ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయానికి కలిసినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.
Advertisement
ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, ఒవైసీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ సమావేశం పర్సనల్ అని చెబుతున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభానికి వెళ్లిన కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అసద్ కూడా అక్కడే ఉన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ అధికారిక నివాసానికి ఎంఐఎం చీఫ్ వెళ్లారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించినందుకు కేసీఆర్ కు అసద్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. మరికొన్ని రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. కొందరు జాతీయస్థాయి నేతలను కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.