Advertisement
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందన్నట్టు.. టీపీసీసీ అంశంలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలు రివర్స్ కొట్టాయి. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఈమధ్యే పలు కమిటీలను ఏర్పాటు చేయగా.. అది చినికి చినికి గాలి వానలా మారింది. మొదట ఒకరిద్దరు నేతలు దీనిపై అసంతృప్తి వెల్లగక్కారు. కానీ, ఆ తర్వాత సీనియర్లు స్వరం అందుకున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నారు.
Advertisement
కొత్తగా ప్రకటించిన కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు హైదరాబాద్ లోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు. మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ ఇలా పలువురు హాజరయ్యారు. మరికొందరు నేతలు జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. మీటింగ్ అనంతరం సీనియర్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు భట్టి విక్రమార్క. పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని.. అందుకే సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు.
Advertisement
భట్టి మాదిరిగానే మిగిలిన నేతలు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ లో సుదీర్ఘంగా ఉంటున్న నాయకులను కోవర్టులు అని ముద్ర వేయడంలో అర్థం లేదని జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ పోటీ చేయవద్దన్నా.. ముఖ్యమంత్రి జిల్లాలో పోటీ చేయకుంటే పార్టీ పరువు పోతుందని తన భార్యను ఎమ్మెల్సీగా బరిలో దింపిన తాము కోవర్టులం ఏలా అవుతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మధుయాష్కీ. కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కమిటీల్లో ఉన్న 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా? అని నిలదీశారు. కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఆయన.. కావాలనే సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదని.. పార్టీని రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని చెప్పుకొచ్చారు.
మొత్తానికి పాత, కొత్త కాంగ్రెస్ నినాదం అందుకున్నారు సీనియర్ నేతలు. రేవంత్ పై పోరుబాటకు దిగినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వివాదం అంతకంతకు మరింత ముదురుతోంది. వచ్చే మంగళవారం మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి మరికొందరిని పిలవాలని చూస్తున్నారు. అదేరోజు అజెండా ప్రకటించాలని నిర్ణయించారు. ఆదివారం పీసీసీ కార్యకవర్గం సమావేశమయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పెట్టే ఏ సమావేశానికీ హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు.