Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఒరిజినల్ కాంగ్రెస్ నినాదాన్ని అందుకున్నారు సీనియర్ నేతలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. పార్టీలో వలస నేతలకు ప్రాధాన్యం ఎక్కువైందని అసంతృప్తి వ్యక్తి చేశారు. ఈమధ్య ప్రకటించిన కమిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై కుట్ర జరుగుతోందని సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ పై యుద్ధం మొదలైందని స్పష్టంగా అర్థం అవుతోంది.
Advertisement
అయితే.. ఇదే అదునుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీనియర్ల నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి మాట్లాడారు. సమావేశంపై ఆరా తీసి.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటానని వారికి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. రేవంత్ రెడ్డిని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు వెంకట్ రెడ్డి. దానికి కారణం టీపీసీసీ పదవి కోసం ఆయన ఎంతగానో ఆశపడ్డారు. కానీ, అధిష్టానం రేవంత్ కే అప్పగించింది.
Advertisement
పదవి విషయంలో బహిరంగంగానే ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే.. పార్టీలో విభిన్న పరిస్థితుల కారణంగా కొన్నాళ్లుగా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు జట్టు కట్టడంతో తాను కూడా అండగా ఉంటానని రంగంలోకి దిగారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఎన్నికలకు ఓ నెల ముందే మాట్లాడతానని వెంకట్ రెడ్డి ఈమధ్యే ప్రకటించారు. కానీ, రేవంత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
వచ్చే మంగళవారం మరోమారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఆ సమావేశానికి మరికొందరిని పిలవాలని నిర్ణయించారు. అదేరోజు అజెండా కూడా ప్రకటించాలని చూస్తున్నారు. ఆదివారం పీసీసీ కార్యకవర్గం సమావేశమయ్యే అవకాశం ఉండగా… రేవంత్ రెడ్డి పెట్టే ఏ సమావేశానికీ హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. మంగళవారం జరిగే భేటీకి కోమటిరెడ్డి కూడా హాజరవుతారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.