Advertisement
ఐటీ అధికారుల రెయిడ్స్ తో ఈమధ్య బాగా వార్తల్లో నలిగింది మల్లారెడ్డి పేరు. ఆయన సంస్థుల, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు జరగడం.. ఆ తర్వాత నోటీసులు ఇవ్వండి.. విచారణ జరగడం.. ఇలా ఎపిసోడ్స్ వారీగా మల్లారెడ్డి చుట్టూ వార్తలు తిరిగాయి. తాజాగా మరోమారు మల్లారెడ్డి పేరు మార్మోగుతోంది. ఈసారి సోదాల విషయంలో కాదులేండి. సొంత పార్టీ నేతల అసమ్మతి స్వరంతో మల్లారెడ్డి వార్తల్లో నిలిచారు.
Advertisement
దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో కొందరు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు మల్లారెడ్డిని ఓ ఆటాడుకున్నారు.
Advertisement
తమ కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికి అవకాశం ఇవ్వలేకపోయామని.. ఒక్క నియోజకవర్గానికే పదవులు ఇస్తే ఎలా అని మల్లారెడ్డిపై ఫైరయ్యారు నేతలు. ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉన్నామని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని, కానీ తొందరపడి జీవో ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ భేటీపై మల్లారెడ్డి స్పందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమైన విషయం గురించి తెలుసుకుంటానని తెలిపారు. తాను పదవులను తన్నుకుపోలేదన్నారు. మార్కెట్ కమిటీకి సంబంధించి సమస్య లేనేలేదని.. అది పాత జీవో అని చెప్పారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో తనకు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల భేటీపై హైకమాండ్ స్పందించింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.