Advertisement
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఓ కొలిక్కి వస్తోంది. బీజేపీ నేతలు ఎక్కడ తమ లీడర్లను ఎగరేసుకుపోతారో అని.. అధిష్టానం త్వరగానే రియాక్ట్ అయింది. అసంతృప్త నేతలతో వరుసగా స్పందింపులు జరిగింది. ముందు ప్రియాంక గాంధీ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితిని చక్కబెట్టేందుకు దిగ్విజయ్ ను రంగంలోకి దింపింది హైకమాండ్. ఆయన వెంటనే తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేశారు. కొందరు నేతలకు ఫోన్లు చేసి ప్రస్తుతానికి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
Advertisement
రెండు రోజుల్లో నగరానికి రానున్నారు దిగ్విజయ్ సింగ్. ఈమేరకు సీనియర్లతో ఆయన మాట్లాడి అన్నీ ఆరోజు మాట్లాడుకుందామని చెప్పారట. ఈ క్రమంలోనే సీనియర్లు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో జరగాల్సిన మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. డిగ్గీరాజా ఇచ్చిన హామీతో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. అయితే.. పార్టీ పరిస్థితిపై, జరుగుతున్న అవమానాలపై దిగ్విజయ్ కు అన్నీ వివరించేందుకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు.
Advertisement
టీపీసీసీ కమిటీల్లో ముందునుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై మండిపడుతున్నారు సీనియర్లు. ఇది ఏమాత్రం సబబు కాదని.. రేవంత్ రెడ్డి నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అయితే.. సీనియర్లను చల్లార్చేందుకు టీపీసీసీ 13 మంది నేతలతో పదవులకు రాజీనామాలు చేయించింది. అయినా కూడా పెద్దలు పట్టువీడడం లేదు. దీంతో దిగ్విజయ్ ను రంగంలోకి దింపింది అధిష్టానం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ గా కొనసాగారు ఈయన. అందరు నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇటు నేతల రాజీనామాపై భట్టి విక్రమార్క స్పందించారు. తాము ఎవరి రాజీనామాకు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. కమిటీల నుంచి ఎవరినీ తొలగించాలని కూడా తాము చెప్పలేదని స్పష్టం చేశారు. వాళ్లంతా తమ సన్నిహితులేనని.. అయితే, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లకు పదవులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వాళ్లకు అన్యాయం జరిగిందన్నదే తమ వాదన అని వ్యాఖ్యానించారు భట్టి.