Advertisement
కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి. మంగళవారం ప్రతిక్ రెడ్డి 11వ వర్థంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన బిడ్డను ప్రజల్లో చూసుకుంటున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.
Advertisement
ముందుగా ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ ద్వారా 200 బెంచీలు, మౌలిక వసతులకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు కోమటిరెడ్డి. అలాగే కాలేజీలో టాయిలెట్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇక నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో 200ల బెంచీలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు వెంకట్ రెడ్డి. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం చేయూతనిస్తున్నామని తెలిపారు.
Advertisement
ఇక నల్గొండ పట్టంణంలో ఉండే కె.అలివేలు ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ, డబ్బులు లేక చదువు ఆపేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి కోమటిరెడ్డి ఆమెకు అండగా నిలబడ్డారు. ఈ సంవత్సరం ఫీజు కింద 75 వేల రూపాయలను అందించారు. అలాగే అలివేలు ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తానని తెలిపారు కోమటిరెడ్డి.
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆపన్నహస్తం అందిస్తున్నామని తెలిపారు వెంకట్ రెడ్డి. పైలట్ సీటు సాధించిన అమృత అనే పేద విద్యార్థినికి పూర్తి ఫీజును కడుతున్నామని, నిజామాబాద్ కు చెందిన హారిక ఎంబీబీఎస్ సీటు సాధిస్తే.. లక్ష 60 వేల రూపాయలు కట్టామని చెప్పారు. ఈ సంవత్సరం 30 మందికి ఎంబీబీఎస్ సీటుకు కావాల్సిన ఫీజును సాయంగా అందించామని వివరించారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని సూచించారు కోమటిరెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రతీక్ పౌండేషన్ సీఈవో గోనారెడ్డి నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.