Advertisement
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన క్రీస్తును కీర్తిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే చివరకు వివాదానికి దారి తీశాయి. ఆయన్ను సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.
Advertisement
దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని..క్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని అన్నారు డీహెచ్. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందని తెలిపారు. అంతటితో ఆగకుండా.. ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలని పిలుపునిచ్చారు.డీహెచ్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Advertisement
క్రీస్తు వల్లే కరోనా అంతమైందని.. వైద్యులిచ్చిన మెడిసిన్స్ వల్ల కాదని డీహెచ్ చేసిన వ్యాఖ్యల్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. క్రీస్తు వల్లే భారత్ అభివృద్ధి చెందిందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని మండిపడింది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.. మతాలను ప్రేరేపించేలా, కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదని తీవ్రంగా హెచ్చరించింది. క్రీస్తు మాత్రమే దైవం.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.
ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టింది వీహెచ్పీ. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని ప్రశ్నించింది. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. నిజానికి డీహెచ్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో వింత పూజలు చేసి వార్తల్లో నిలిచారు. దేవతగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇటీవల ప్రగతి భవన్ లో కేసీఆర్ కాళ్లపై పడ్డారు. నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కాళ్లు మొక్కారు. డీహెచ్ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి. ఈలోపే మరో వివాదంలో చిక్కుకున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా డీహెచ్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ డీహెచ్ కు ఏమైందని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.