Advertisement
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఒకటి. అధికార పార్టీకి చెందిన నేతల్ని కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసు నమోదైంది. బేరసారాలు జరిపారంటూ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఎవరున్నారేది ఇప్పటివరకు బయటపడలేదు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినా వారిని విచారించలేకపోయింది సిట్. ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇంకోవైపు కోర్టుల్లో ఈ కేసు చుట్టూ దాఖలైన పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి.
Advertisement
ఇలాంటి సమయంలో ఈ కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు ఈడీ అధికారులు. సిట్ కన్నా మరింత దూకుడుగా ఈ కేసులో ముందుకు సాగాలని నిర్ణయించారు అధికారులు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డిని ప్రశ్నించారు. తాజాగా వ్యాపారవేత్త అభిషేక్ ఆవులను కూడా విచారించారు.
Advertisement
ఇటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ చంచల్ గూడ జైలులో ఉండగా.. అతడ్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు. రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ను విచారించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఈ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ లకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. సిట్ నోటీసులపై మరోసారి స్టే ను పొడిగించింది. ముందుగా ఈనెల 14న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో స్టే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం సీఆర్పీసీ 41ఏ కింద ఇచ్చిన నోటీసులపై స్టేను ఈ నెల 30 వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది న్యాయస్థానం.