Advertisement
తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు పెద్ద సంచలనం. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చూస్తోందని బీఆర్ఎస్ తెగ గగ్గోలు పెట్టింది. కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో వేసిన సిట్ దర్యాప్తు ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఆనాడు స్పాట్ లో దొరికిన ముగ్గుర్ని అరెస్ట్ చేసి విచారించింది. ఇంకా కీలకంగా భావించిన మరో ముగ్గుర్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. వారిని ఎలాగైనా విచారించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది.
Advertisement
ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే సీన్ లోకి ఈడీ ఎంటర్ అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ రాకతో ఎన్నో లింక్స్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నందకుమార్ డీలింగ్స్ పై ఫోకస్ పెట్టిన అధికారులు.. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నందుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అతన్ని విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోరారు. అలాగే నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నలుగురు అధికారులతో కూడిన బృందానికి అనుమతించేలా చంచల్ గూడ జైలు పర్యవేక్షణాధికారిని ఆదేశించాలన్నారు.
Advertisement
మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను తాము పరిశీలించామని.. అందులో వందల కోట్ల డీల్ గురించి చర్చించినందున మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈనెల 15న ఈసీఐఆర్ నమోదు చేశామన్నారు. కేసులో నిందితుడు నందకుమార్ ను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోర్టును కోరినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఈడీ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అనుమతి ఇచ్చింది. 26న అతడ్ని విచారించనున్నారు అధికారులు.
ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించారు అధికారులు. అతనితోపాటు మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ ఆవలను కూడా ప్రశ్నించారు. వీళ్లిద్దరితో నందుకు డీలింగ్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు.