Advertisement
రాజ్ భవన్, ప్రగతి భవన్ వివాదం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. గవర్నర్ తమిళిసై ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తుండడం.. దానికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వడం కామన్ అయిపోయింది. కొందరు నేతలు అయితే.. గవర్నర్ బీజేపీ లీడర్ లా మాట్లాడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అయినా కూడా తమిళిసై తగ్గేదే లేదు అన్నట్టు.. ప్రశ్నిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసొస్తున్నారు.
Advertisement
దీనికితోడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తుండడం.. జిల్లా పర్యటనల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం వంటి వాటిపై తమిళిసై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన ఈ దూరం ఎప్పటికీ తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఆమధ్య సీఎం కేసీఆర్.. తమిళిసైతో భేటీ అయినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్, సీఎం ఒకే వేదికను పంచుకోనున్నారు.
Advertisement
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఢిల్లీ నుండి నేరుగా స్పెషల్ ఫ్లైట్ లో హకీంపేట ఎయిర్ పోర్టులో దిగనున్నారు. ఆమెకు ఎయిర్ పోర్టులో గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. అలాగే సోమవారం జరిగే ఓ కార్యక్రమంలో కూడా వీరిద్దరు కలిసి పాల్గొనన్నారు. దీంతో ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము 30వ తేదీ వరకు బస చేస్తారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆమె తెలంగాణకు వస్తున్నారు. శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో, సమీప ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రాష్ట్రపతి నిలయం పరిసరాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తులు వేసవి కాలంలో సిమ్లాకు, శీతాకాలంలో హైదరాబాద్ పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ లో శీతాకాల విడిదికి రాలేదు.