Advertisement
తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు ట్రెండింగ్ లో ఉండే వార్త. ఎప్పుడేం జరుగుతుందా అని మీడియా ఎదురుచూస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టే కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఇప్పటిదాకా ఎన్నో కీలక పరిణామాలు ఈ ఇష్యూలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఈడీ చుట్టూ అంతా తిరుగుతోంది. కీలక నిందితుడుగా భావిస్తున్న నందకుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో అని అంతా ఆసక్తిగా అటువైపే చూస్తున్నారు.
Advertisement
నందకుమార్ తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించారని.. ఇప్పుడు నందుని ప్రశ్నించనున్నారని అంటున్నారు. అయితే.. ఈ కేసులో రోహిత్ రెడ్డి వాదన మరోలా ఉంది. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న కుట్రగా ఆయన చెబుతున్నారు. ఎలాగైనా తన పేరును నందు చెప్పేలా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
బీజేపీ జాతీయ నేతల బండారం బయటపెట్టానన్న కోపంతోనే తనను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు రోహిత్ రెడ్డి. అందులో భాగంగానే.. ఈడీ నోటీసులిచ్చి రెండు రోజులు విచారించిందని.. వాళ్లకు కావాల్సిన ఎలాంటి ఆధారాలు దొరకకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చినట్టు తనకు సమాచారం అందిందని తెలిపారు. అందుకే హైకోర్టులో రిట్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్న ఆయన… ఎన్ని నోటీసులు పంపించినా.. ఎన్ని కుట్రలు చేసినా.. వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు ఈడీకి సంబంధమేం లేదన్నారు రోహిత్ రెడ్డి. ఈ కేసులో ఎక్కడా మనీలాండరింగ్ జరగలేదని.. అయినా.. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ చేత నోటీసులిప్పించి విచారించి లొంగదీసుకోవాలని చూశారని ఆరోపించారు. నంద కుమార్ ను ఈడీ విచారించి.. వాళ్లకు కావాల్సిన విధంగా స్టేట్ మెంట్ తీసుకుని.. తనను ఇరికించాలని చూస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న ఈ కొత్త కుట్రలను భగ్నం చేస్తామని చెప్పారు.