Advertisement
కందుకూరు తోపులాట ఏపీలోని విషాద ఘటనల్లో ఒకటిగా మిగిలిపోయింది. చంద్రబాబు సభకు విపరీతంగా జనం తరలిరావడంతో తోపులాట జరిగి 8 మంది చనిపోయారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డారు. టీడీపీ తరఫున ఆర్థిక భరోసా కల్పించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.24 లక్షల చొప్పున సాయం చేశారు. టీడీపీ తరఫున రూ.15 లక్షలు ఇవ్వగా, మిగిలిన రూ.9 లక్షలు పార్టీ నేతలు అందించారు.
Advertisement
కందుకూరు మండలం ఓగూరు ఎస్సీ కాలనీలో గడ్డం మధుబాబు నివాసానికి వెళ్లిన చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అన్నివిధాలా పార్టీ అండగా ఉంటుందని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పిల్లలను చదివిస్తామని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచి గుర్రంవారిపాలెంలో కాకుమాని నాగరాజు కుటుంబ సభ్యులను, కొండముడుసుపాలెం ఎస్సీ కాలనీలో కలవకూరి యానాది కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ రెండు కుటుంబాల్లోని విద్యార్థుల చదువు బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుందని ప్రకటించారు.
Advertisement
మరోవైపు ప్రధాని మోడీ ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ లో ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకురూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’’ అని తెలిపారు. ఇటు సీఎం జగన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేది కార్యకర్తలేనని అభిప్రాయపడ్డారు. రోడ్ షో లో తొక్కిసలాట జరిగి 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించడం దురదృష్టకరమని అన్నారు. అనేక మందికి గాయాలపాలయ్యారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇది విచారకరమైన సంఘటన అని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాజకీయ పార్టీలు, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్.
మరోవైపు ఈ ఘటన చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలు తిట్ల దండకం అందుకున్నారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగితే వైసీపీ నేతలు రాజకీయ కోణంలో రాద్దాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ఈ ఘటన జరిగిందని వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇస్తున్నారు.