Advertisement
తెలంగాణలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ.. ఇంకోవైపు చేరికలను ప్రోత్సహిస్తోంది. మిషన్ 90 నినాదం అందుకుంది. అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ లో బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల సమావేశాలను నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు చివరిరోజు బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు బీఎల్ సంతోష్. ఎన్నికల హామీలతో పాటు రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని.. వాటిని గుర్తించి ఆందోళన కార్యక్రమాలకు కార్యచరణ రూపొందించాలని చెప్పారు. జనవరి 16 నుంచి బండి సంజయ్ నియోజకవర్గాలకు వెళ్లనున్నారని.. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారని వెల్లడించారు.
Advertisement
రాబోయే 8 నెలల్లో ఎన్నికలు రావచ్చని.. మిషన్ 90పై ఫోకస్ చేయాలన్నారు సంతోష్. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని.. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలని తెలిపారు. ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ లు పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని.. వచ్చే 3 నెలల్లోపు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారానికి ఓసారి మండలం, 15 రోజులకోసారి జిల్లా, నెలకోసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని దశానిర్దేశం చేశారు.
ఇక మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపై మొదటిసారి స్పందించారు బీఎల్. ఆరోపణలు చేసినవాళ్లు తగిన పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని విమర్శలు చేశారు. తానేంటో ఎవరికీ తెలియదని.. ఇప్పుడు తెలంగాణలో ప్రతీ ఇంటికి తన పేరును తీసుకెళ్లారని అన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల ఎర కేసును తాజాగా సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు వేసింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు సీబీఐ వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.