Advertisement
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏటా నుమాయిష్ నిర్వహిస్తుంటారు. రకరకాల స్టాల్స్ తో ఎగ్జిబిషన్ లో సందడి ఉంటుంది. ఈసారి 82వ నుమాయిష్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎంతోమంది వ్యాపారులు ఇక్కడకు వస్తారన్నారు. ఈ సొసైటీ ద్వారా 30వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని తెలిపారు.
Advertisement
ఈ నుమాయిష్ 45 రోజుల పాటు కొనసాగనున్నది. దీన్ని మొదటగా 1938లో ప్రారంభించారు. అప్పట్లో వంద స్టాల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 2,400కు చేరుకుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనకు కరోనా వైరస్, ఇతర కారణాల దృష్ట్యా గత రెండేళ్లుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, ఈసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
Advertisement
ఈ ఎగ్జిబిషన్ పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ లాంటిది. హైదరాబాద్ లో 23 ఎకరాల వేదికగా 46 రోజుల పాటు ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ రోజులు జరుపుకునే ఎగ్జిబిషన్ ఇదేనని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం దేశ నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులతో ఎగ్జిబిషన్ కు గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది.
1938లో దీన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిజాం ఆఫ్ హైదరాబాద్, మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రారంభించారు. మొదట ఉస్మానియా విద్యార్థులతో వంద స్టాల్స్ తో పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. తరువాత క్రమంగా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న మైదానంలో దీన్ని నిర్వహించారు. ఎగ్జిబిషన్ ని నుమాయిష్ గా కూడా పిలుస్తారు. ఇది ఉర్దూ పదం. దీని అర్థం తెలుగులో సంత.