Advertisement
దేశంలో ఎక్కడైనా సరే.. అధికార పార్టీని కాదని పోలీసులు చేసేదేమీ ఉండదు. కొందరు సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నా పై అధికారులను కాదని ఏం చేయలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతున్నారు పోలీసులు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులకు నేతలు వార్నింగులు ఇస్తున్నారు. తెలంగాణలో కూడా ఇది తరచూ జరుగుతుంటుంది. అధికార బీఆర్ఎస్ కు వంత పాడుతున్నారని.. ప్రతిపక్ష నేతలు తిడుతూ ఉంటారు. కొందరైతే.. పింక్ కలర్ డ్రెస్సులు వేసుకోమని ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగే తంతే.
Advertisement
పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాం. అధికారం కోసం బీజేపీ అనేక ప్రయత్నాల్లో ఉంది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బలం పుంజుకుని ఏకంగా సీఎంనే ఓడించింది. అయితే.. ఓట్ల శాతం పెంచుకున్నా.. ఎక్కువగా సీట్లను మాత్రం సాధించలేకపోయింది. నిత్యం రావణకాష్టంలా బెంగాల్ మండిపోతూ ఉంటుంది. ఎక్కడో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏం జరిగినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి వత్తాసు పలుకుతుంటారని ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈక్రమంలో ఓ ఎమ్మెల్యే ఖాకీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
పశ్చిమ బెంగాల్లో పోలీస్ స్టేషన్కు నిప్పు పెడతానని బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ను తగులబెడతామని స్వపన్ మజుందార్ హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యేపై టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 పరగణాల జిల్లాల్లోని నిర్వహించిన సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మజుందార్ మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని అన్నారు. తమ మాటను అసలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పోలీసులు టీఎంసీ ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే బెదిరింపులకు దిగడంతో టీఎంసీ నేతలు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రకటన చేయడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భుర్కుందలో బీజేపీ మండల అధ్యక్షుడు దిలీప్ వైద్య హత్యకు గురయ్యారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆయన్ని టీఎంసీ నేతలు హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా కూడా నిందితులను అరెస్ట్ చేయలేదని బీజేపీ ఆరోపించింది. ఈ హత్యకు నిరసనగా నైహతి రోడ్డు నుంచి భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ క్రమంలోనే మజుందార్ ఈ వ్యాఖ్యలు చేశారు.