Advertisement
బీఆర్ఎస్ ను దేశవ్యాప్తం చేయాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. దేశమంతా దళితబంధు అమలు చేస్తామని చెబుతున్నారు. రైతు రాజ్యం తీసుకొస్తామని అంటున్నారు. ఈక్రమంలో తొలి అడుగుగా తెలంగాణలో మరోసారి అధికారం కోసం పావులు కదుపుతున్నారు. ఇక రెండో అడుగుగా.. ఏపీలో క్రియాశీలకంగా మారాలని చూస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన కొందరు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారిలో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్ధసారథి, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఉన్నారు.
Advertisement
అయితే.. అనూహ్యంగా తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. దీంతో.. అసలు ఈయన ఎవరు..? ఇప్పటిదాకా ఏం చేశారు..? ఏ పార్టీలో ఉన్నారు..? ఇలా అనేక ప్రశ్నలతో గూగుల్ లో సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అలాంటి వారి కోసం ఆయన ప్రొఫైల్ ను మీకోసం అందిస్తున్నాం.
Advertisement
తోట చంద్రశేఖర్ ప్రొఫైల్
మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ గా 23 ఏళ్లపాటు పనిచేశారు. 2009లో ఏఏఎస్ హోదాకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గుంటూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. కానీ, ఓటమి తప్పలేదు. ఇదే ఆయనకు తొలి ఎన్నికలు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అలాగే 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 రెండుసార్లూ విజయం దక్కలేదు.
ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన ఈయనను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ నియమించారు. మొన్నటిదాకా చంద్రశేఖర్ జనసేన పార్టీలో ఉన్నారు. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రకటన రావడంతో కేసీఆర్ కు టచ్ లోకి వెళ్లారు. పలు దఫాలు చర్చలు జరిపి చివరకు గులాబీ బాస్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు.