Advertisement
ఏపీలో కూడా పాగా వేయాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ లోకి కొందరు నేతల్ని చేర్చుకున్నారు. ఆ సందర్భంగా కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు మాట బదులిచ్చారు. కేసీఆర్ చేసిన ఒక్కో కామెంట్ కు రెండు, మూడు కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి.. ముందుగా కేసీఆర్ ఏపీ ప్రజలను అవహేళన చేశారని పాత విషయాలను గుర్తు చేశారు.
Advertisement
ఏపీ ప్రజలను అవమానించి ఇప్పుడు అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి. అప్పట్లో ఏపీ వాళ్లు తయారు చేసిన బిర్యానీని పేడ బిర్యానీ అని హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే.. వాళ్ల ఉలవచారును తెలంగాణలోని ఎడ్లు, బర్లు తింటాయని కేసీఆర్ అన్నారని చెప్పారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అక్కడి వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఏపీకి క్యాబ్ లను పంపించి.. బీఆర్ఎస్ లో చేరేందుకు నేతలను పిలిపించుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా అని సంజయ్ ప్రశ్నించారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ రెచ్చగొడతారని.. నమ్మించి అందరి ఓట్లు వేయించుకోవడం కేసీఆర్ కి తెలిసిన విద్య అని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేకుండా.. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై మాట్లాడిన కేసీఆర్.. ముందు నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో చెప్పాలని నిలదీశారు.
Advertisement
మాట్లాడితే చైనా గురించి గొప్పలు చెప్పే కేసీఆర్ కు… ఆయన ఫాంహౌజ్ కు సమీపంలోనే భారత్ బయోటెక్ ఉందని.. కొవిడ్ టీకా అందులో ఉత్పత్తి అవుతున్న విషయం తెలుసా? అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కేసీఆర్.. దేశాన్ని ఏ విధంగా ఉద్దరిస్తారని నిలదీశారు. భారత్ లో చైనా బజార్లు తప్ప భారత్ బజార్లు కన్పించలేదని కేసీఆర్ అన్నారని.. అలా అయితే తెలంగాణలో తెలంగాణ బజార్ ఉందా అని అడిగారు. మిగితా దేశాల్లో భారత్ బజార్ లు ఉంటాయని.. స్వదేశంలో ఎందుకుంటాయని అడిగారు. మైసూర్ పాక్ అంటే మైసూర్ లో తయారు చేస్తారా.. ఇరానీ చాయ్ ఇరాన్ లో తయారు చేస్తారా అంటూ సెటైర్లు వేశారు.
ప్రభుత్వం సాగు నీరు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోందని.. మరి తెలంగాణ ఏర్పాటుకు ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 23 లక్షలకు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు సంజయ్. కేసీఆర్ పరిపాలనలో అన్ని సూచీల్లో తెలంగాణ దారుణంగా ఉందన్నారు. పాఠశాల విద్యలో 21వ స్థానంలో.. నిరుద్యోగంలో 4వ స్థానంలో.. రైతుల ఆత్మహత్యలో 5వ స్థానంలో ఉందని వివరించారు. గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు రూ.40వేల కోట్లు సమకూరుతున్నాయని.. ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ము ఎటుపోతోందని నిలదీశారు బండి సంజయ్.