Advertisement
ఓవైపు కేసీఆర్ ను గద్దె దించుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ, ఇంకోవైపు పార్టీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు. ఈమధ్య కొందరు సీనియర్లు కమిటీల ఏర్పాటుపై పెదవి విరిచారు. ఢిల్లీ పెద్ద దిగ్విజయ్ సింగ్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అందరి దగ్గర అన్ని వివరాలు సేకరించి ఆయన తిరిగి హస్తన వెళ్లారు. సీనియర్లు చల్లబడతారని అంతా అనుకున్నా.. సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఇంతకుముందున్న చురుగుగా పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement
అయితే.. బోయిన్ పల్లిలో శిక్షణా తరగతులు జరగనున్నాయి. మరి.. వీటికి సీనియర్లు హాజరవుతారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానానికి కూడా ఈ అనుమానం వచ్చి.. పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. అసమ్మతి నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. ఈ మేరకు విషయాన్ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బోయిన్ పల్లిలో జరిగే శిక్షణా తరగతులకు హాజరుకావాలని వారిని కోరినట్టు తెలిపారు.
Advertisement
మాజీ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఖర్గే ఫోన్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు మహేశ్వర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరినట్టు చెప్పారు. అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో సీనియర్లు ఆలోచనలో పడినట్లు తెలస్తోంది. బోయిన్ పల్లిలో జరిగబోయే శిక్షణా తరగతులకు హాజరు కావాలా? వద్దా? అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు పీసీసీ చీఫ్ కు ఏఐసీసీ నుంచి అనుమతి లేదని మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ సర్క్యులర్ ప్రకారం ఈ నెల 26 నుంచి రెండు నెలలపాటు బ్లాక్ స్థాయిలో పాదయాత్ర నిర్వహించాలని సూచించినట్టు చెప్పారు. చివరగా హైదరాబాద్ లో నిర్వహించబోయే పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారని వెల్లడించారు. అదే విధంగా మహిళా కాంగ్రెస్ నిర్వహించబోయే పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని తెగ ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో మహేశ్వర్ రెడ్డి ఇలా మాట్లాడడం హాట్ టాపిక్ అయింది.