Advertisement
ఏపీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పై తమదైన రీతిలో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఎవరూ ఘోరమైన రీతిలో రియాక్ట్ అవ్వడం లేదుగానీ.. ఓవైపు స్వాగతిస్తూనే సెటైర్స్ వేస్తున్నారు. ఏకంగా తెలంగాణ సీఎంను కేఏ పాల్ తో పోలుస్తున్నారు. ఓరకంగా చెప్పాలంటే.. ఆంధ్రాలో బీఆర్ఎస్ పోటీ చేస్తే పాల్ పార్టీ గతే అని ఇండైరెక్ట్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే.. పాల్ అలా కాదు. కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టారు.
Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నేతలు చేరడంపై కేఏ పాల్ మండిపడ్డారు. రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్ అమ్ముడుపోయారని విమర్శించారు కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే హక్కులేదని స్పష్టం చేశారు పాల్. మంత్రి మల్లారెడ్డి తిరుమల వేదికగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఏపీలో బీఆర్ఎస్ నామస్మరణ జరుగుతోంది. పార్టీలన్నీ తమదైన రీతిలో స్పందిస్తున్నాయి. ఈక్రమంలోనే పాల్ కూడా.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
Advertisement
ఇటు మాజీ మంత్రి హరిరామజోగయ్య నిరాహార దీక్షపై స్పందించారు పాల్. ఈ వయసులో ఈ ధర్నాలు, దీక్షలు? ఏంటి? మీకు కావాల్సింది రిజర్వేషన్లా? రాజ్యాధికారమా? అంటూ ప్రశ్నించారు. తనతో కలిసి రావాలని.. అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. తాను బాబుతో సహా అనేక మందిని సీఎంలుగా చేశానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కారణంగానే ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలపై వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించిందని దుయ్యబట్టారు. టీడీపీ కంటే వైసీపీ వందరెట్లు బెటర్ అని అన్నారు. చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఎన్నారైల నల్ల డబ్బును.. తెల్ల డబ్బుగా మార్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు పాల్.