Advertisement
ఈమధ్య కాలంలో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కామన్ అయిపోయాయి. రోజూ ఎవరో ఒకరు కేసీఆర్ నివాసాన్ని ముట్టడించేందుకు చూస్తున్నారు. వారిని ఆపలేక పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. పోలీస్ నియామకల్లో కొత్త నిబంధనలతో చాలామంది అభ్యర్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థులు, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా ప్రభుత్వం మొండిపట్టుతో ఉందని నిరసనలు పెరిగిపోయాయి.
Advertisement
ఈక్రమంలోనే ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు బీజేవైఎం నేతలు.ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులకు కలపాలని, లాంగ్ జంప్ ను పాత పద్ధతిలోనే నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Advertisement
నెల రోజులుగా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేవైఎం నేతలు, అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీస్ పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు.
పరీక్ష రాసిన వేలమంది రోడ్డు మీదకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం అర్థం చేసుకోవాలన్నారు బండి. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. 2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా అని ప్రశ్నించారు. వీళ్ళ బాధలు వినలేనంత తీరిక లేకుండా సీఎం ఏం ఘనకార్యం చేస్తున్నారని విమర్శించారు. పరీక్షా నిబంధనను మార్చాలని తానే స్వయంగా సీఎంకి లేఖ రాసినా స్పందించలేదని మండిపడ్డారు బండి సంజయ్.