Advertisement
కామారెడ్డి అట్టుడుకుతోంది. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్ పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్లాన్ లో 8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కింద ప్రతిపాదించారు. తమ భూములు పోతున్నాయని రైతులు నిరసన బాట పట్టారు.
Advertisement
మూడు రోజులపాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కన్సల్టెన్సీ, డీటీసీపీ చేసిన పొరపాటు వల్లే ఈ గందరగోళం నెలకొందని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయమని పేర్కొన్నారు. ఒక్క గుంట భూమి కూడా పోదని స్పష్టం చేశారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ గురించి 60 రోజుల ముందే పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు సమయం ఉందని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే.. రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
Advertisement
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని తెలిపారు. అందులో మార్పులు, చేర్పులు జరుగుతాయని.. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని చెప్పారు. ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని ఇప్పటికే ప్రకటించామన్న ఆయన.. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా వేశామని తెలిపారు. ఇప్పటివరకు 1026 అభ్యర్థనలు వచ్చాయని.. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందనక్కర్లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమేనని.. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు.
మరోవైపు మాస్టర్ ప్లాన్ విషయంలో హైకోర్టు మెట్లెక్కారు రైతులు. తమకు అన్యాయం చేస్తున్నారని న్యాయం చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇటు కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర బీజేపీ నేతలు చేసిన హడావుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్ సహా పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి.