Advertisement
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోసారి అగ్ర నేతలు రాష్ట్రానికి రానున్నారు. ముందుగా ప్రధాని మోడీ 19న తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించడంతోపాటు రూ.7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో మోడీ ఏం మాట్లాడనున్నారనే ఉత్కంఠ నెలకొంది.
Advertisement
ఇటు ఈనెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా ఆయన టూర్ సాగనుంది. వివిధ స్థాయిలో బీజేపీ నేతలతో సమావేశం కానున్న ఆయన.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయన్నారు. తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.
Advertisement
రెండు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు నడ్డా 119 నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఇది వర్చువల్ గా జరిగింది. దీనికోసం అన్ని నియోజవర్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసేలా బూత్ కమిటీలకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు గ్రామాలకు పార్టీ విస్తరణ, ఇంటింటి ప్రచారంపై పలు సూచనలు చేశారు.
మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ 11, 12న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటించి పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు. ముందుగా కూకట్ పల్లిలో 11న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొంటారు. మెదక్ సెగ్మెంట్ కు చెందిన నేతలతో పటాన్ చెరులో 12 భేటీ కానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు బన్సల్. మొత్తానికి బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.