Advertisement
అధిష్టానం ఎంత బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా.. టీపీసీసీలో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. నాయకులు గ్రూపులుగా విడిపోయి.. బహిరంగంగానే తిట్టుకోవడం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పైగా బయటకు వెళ్తున్న నేతలు రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ ను సాగనంపిన అధిష్టానం.. ఆయన స్థానంలో ఈమధ్యే మాణిక్ రావు థాక్రేను నియమించింది. ఈక్రమంలోనే తొలిసారి హైదరాబాద్ వచ్చిన థాక్రేకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర నేతలు.
Advertisement
ఎయిర్ పోర్ట్ లో మాణిక్ రావును రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇతర నేతలు ఆహ్వానించారు. అనంతరం గాంధీభవన్ కు వెళ్లారు. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. థాక్రే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సీనియర్లు అలకపాన్పు ఎక్కడంతో వారిని బుజ్జగించి అందర్నీ ఏం చేసేందుకు ఈయన ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అనేది ఉత్కంఠగా మారింది.
Advertisement
మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు ఫోన్ చేశారు. గాంధీ భవన్ కు రావాలని ఆహ్వానించారు. అయితే.. ఆయన మాత్రం బయటే కలుస్తా అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ పదవి తనకు కాకుండా రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై గతంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో గాంధీభవన్ మెట్లు ఎక్కనని శపథం చేశారు. అయితే.. మధ్యలో పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం ఓసారి వెళ్లారు. అంతేగానీ.. ప్రెస్ మీట్లకు, పార్టీ నేతలను కలవడానికి మాత్రం కోమటిరెడ్డి అటువైపు చూడడం లేదు. ఇప్పుడు థాక్రే ఆహ్వానం మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ థాక్రేను కోమటిరెడ్డి కలిస్తే ఏం మాట్లాడతారనేది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్. రేవంత్ తో ఉన్న విభేదాల కారణంగా తనకు జరిగిన అవమానాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మొన్న దిగ్విజయ్ సింగ్ రాక సందర్భంగా కూడా ఇవే విషయాలను ఆయన ప్రస్తావించారు. అలాగే పార్టీని నేతలు ఎందుకు వీడాల్సి వస్తుందో కూడా వివరించే అవకాశం ఉందంటున్నారు. మరి.. కోమటిరెడ్డి ఏ చేస్తారో చూడాలి.