Advertisement
జాతీయ రాజకీయాల రాగం అందుకున్నాక.. కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏ సభలో పాల్గొన్నా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతోందని మండిపడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ లో పర్యటించిన కేసీఆర్.. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. మోడీ సర్కార్ అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని ఆరోపించారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు.
Advertisement
మహబూబాబాద్ లో జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు కేసీఆర్. దేశ అభివృద్ధిపై యువకులు చర్చించాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుందని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 20 ఏండ్లు గడిచినా తీర్పులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతపిచ్చి, కులపిచ్చితో ప్రజలను విడదీస్తే మరో ఆఫ్ఘాన్ లా తయారవుతుందన్నారు. కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
Advertisement
తెలంగాణ ఏర్పడింది కాబట్టే రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్ ప్రాంతం వెనుకబాటుకు గురైందని అన్నారు. మనం చేసుకుంటున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సగం చేసినా దేశం ఇప్పటికే బాగుపడేదని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించకపోగా.. అడ్డుపడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశం ఇలాగే ఉంటుందని విమర్శించారు కేసీఆర్.
పూర్తిగా గిరిజన ప్రాంతమైన జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రకటించారు. అంతేగాక, జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు అనౌన్స్ చేశారు. ఉద్యమ సమయంలో మహబూబాబాద్ లో దారుణమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు కేసీఆర్.