Advertisement
నాయకుడు అంటే ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా గర్తుకురావాలి. కానీ, ఈ కాలంలో అలాంటి నాయకులు కొందరే ఉన్నారు. తమ అనుచరణగణానికే ఎమ్మెల్యేనని ప్రజల్ని పట్టించుకోని నేతలు ఎందరో. అయితే.. జనం తిరగబడితే అసలుకే ఎసరు తప్పదు. ఓట్లేసి ఎలా గెలిపించారో.. నో చెప్పి దింపేయడం పెద్ద కష్టమేం కాదు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా చేయడం కూడా వారికి తెలుసు. ప్రస్తుతం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు చిన్నపాటి శాంపిల్స్ చూపిస్తున్నారు ప్రజలు.
Advertisement
సంక్రాంతి అంటే ఎంత సందడిగా ఉంటుందో మనకు తెలుసు. కుటుంబసభ్యులందరూ ఎంతో సంతోషంగా పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. అయితే.. మంచిర్యాల జిల్లాలో ఇచ్చిన హామీ మర్చిపోయిన ఎమ్మెల్యేకు ముగ్గుల రూపంలో దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు తాండూరు మండలం రేపల్లి గ్రామస్తులు.
Advertisement
చాలాకాలంగా గ్రామస్తులు సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు. అధికారుల చుట్టు చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. పలుమార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. చివరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 3 నెలల్లో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యే మాట ఇచ్చి 7 నెలలు గడిచినా.. రోడ్డు జాడ లేదు. ఎలాంటి మంజూరు కాలేదు. పైగా హామీ నెరవేర్చమని అడిగిన వారిపై 3 అక్రమ కేసులు పెట్టించారని వాపోతున్నారు.
ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో నిరసన తెలియజేశారు. 3 నెలల్లో రోడ్డేస్తానని హామీ ఇచ్చి 7 నెలలైనా ఇప్పటికీ అమలు చేయించకపోగా.. ముగ్గురిపై అక్రమ కేసులు పెట్టించారు.. ఇప్పటికైనా రోడ్డు వేయించి ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోండి అంటూ ముగ్గులతో తన ఆవేదనను అందరికీ తెలిసేలా చేశారు గ్రామస్తులు. ప్రస్తుతం ఈ ముగ్గులు చర్చనీయాంశంగా మారాయి.