Advertisement
భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఒక నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. సంక్రాంత్రి రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే ఢిల్లీ నుంచి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. పండుగ పూట తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది గొప్ప కానుక అని వ్యాఖ్యానించారు మోడీ. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక సౌకర్యాలతో తయారైన వందే భారత్.. ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీక అని తెలిపారు.
Advertisement
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ రూ.3,500 కోట్లు ఇస్తున్నారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాటితో రాష్ట్రంలో రైల్వేలను ఉత్తమ మార్గంలో అభివృద్ధి చేయాలని అన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ను ప్రపంచ స్థాయి స్టేషన్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Advertisement
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్తుంది. ఈ సందర్భంగా ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. దీన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు. అంతకుముందు వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో మారుమోగింది. దేశ్ కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, మోడీ మోడీ అంటూ బీజేపీ నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు వందే భారత్ కు ఇంత ప్రచారం దేనికని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇది సామాన్యుడి రైలు కాదని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పండగ పూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నప్పటికీ మాట్లాడక తప్పడం లేదన్నారు. దేశ ప్రధాని, ఇద్దరు కేంద్రమంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. మోడీ ప్రారంభించిన వందేభారత్ రైలులో ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు పొన్నాల.