Advertisement
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. అధ్యక్ష పదవి దగ్గర మొదలైన వైరం.. ఎన్నో విషయాల్లో విభేదాలను బయటపెట్టింది. ఒకటి, రెండు సందర్భాల్లో వీళ్లిద్దరూ కలిసినా.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన దగ్గర నుంచి దూరం బాగా పెరిగింది. పైగా కొందరు నేతలు అత్యుత్సాహంతో కోమటిరెడ్డిని టార్గెట్ చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. క్రమంగా.. రేవంత్, వెంకట్ రెడ్డి వర్గాలుగా గొడవలు జరిగాయి.
Advertisement
అయితే.. శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరి చేతిలో చెయ్యేసుకుని మాట్లాడుతూ కనిపించారు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కు కూడా వెళ్లారు. అక్కడే ఈ దృశ్యం కనిపించింది. ఇద్దరు నేతలు ఒకరినొకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు థేక్రే నగరానికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకే కోమటిరెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు.
Advertisement
పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి తన వంతు సహకారం అందిస్తానని.. తనకున్న సూచనలను అందిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 26 నుంచి నిర్వహించబోయే పార్టీ కార్యక్రమాల్లో, హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. మాణిక్ రావు థాక్రేతో ఒంటరిగా భేటీ అయ్యారు వెంకట్ రెడ్డి. పార్టీలోని సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత విషయాలను పక్కనపెట్టి పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరినట్లు తెలిపారు. 50 శాతం టికెట్స్ ముందే ఇవ్వాలని చెప్పానన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కువ పోటీ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచనలు చేశానని చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలా అనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
‘‘పార్టీలో గౌరవం దక్కాలి. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పని చేస్తా. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజల మనసులో ఉంది’’ అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.