Advertisement
హైదరాబాద్ మహానగరంలో భవనాల నిర్మాణాలపై సరైన దృష్టి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనతో ఇది మరోసారి స్పష్టమైందని అంటున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రజలకు తోడయ్యాయి. సేఫ్టీ రూల్స్ ను గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
Advertisement
అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆయనకు చెప్పండంతో.. వెంటనే కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కిషన్ రెడ్డి. అలాగే బస్తీవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రాష్ట్ర సర్కార్ పై మండిపడ్డారు. జీహెచ్ఎంసీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం సరైనది కాదని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలేనని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని గుర్తుచేశారు కిషన్ రెడ్డి.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కిషన్ రెడ్డి టూరిస్ట్ లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. డెక్కన్ కాంప్లెక్స్ పై నిపుణుల రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇలాంటి గోడౌన్స్ గ్రేటర్ పరిధిలో 25 వేలు ఉన్నాయని అంచనాకు వచ్చామని చెప్పారు. ఒకేసారి భవనాలపై చర్యలు తీసుకుంటే పేదలు ఉపాధి కోల్పోతారని.. భవనాల కూల్చివేతపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు తలసాని.