Advertisement
ఇంకో పది నెలల్లో ఎన్నికలు అని.. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే.. షెడ్యూల్ టైమ్ కంటే అప్పటికే ఓ మూడు నెలలు ముందుకు జరిపారు కేసీఆర్. కానీ, పది నెలలు కాస్త నాలుగు నెలలుగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీ రద్దు పక్కా అని చెప్పారు. సరిగ్గా ఇదే టైమ్ లో బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
Advertisement
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అదేరోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు రోజే ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ లో క్యాబినెట్ సమావేశం జరిగి బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు.
Advertisement
అసెంబ్లీ, కౌన్సిల్ లో బడ్జెట్ సమర్పణ ఫిబ్రవరి 3న పూర్తి కాగానే రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. తిరిగి సభా సమావేశాలు ఫిబ్రవరి 6 నుంచి మొదలు అవుతాయి. గతేడాది మార్చి 6 నుంచి 15 వరకు సమావేశాలు జరిగాయి. ఈసారి ఎన్ని రోజులు జరుగుతాయనేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఖరారు కానుంది.
గతేడాది రాష్ట్ర బడ్జెట్ ను మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టారు. ఎప్పటినుంచో ఇదే జరుగుతోంది. అయితే.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించడంతో బడ్జెట్ ను ముందే ప్రవేశ పెడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలను ముందుగానే తీసుకొచ్చే క్రమంలో బడ్జెట్ ను ముందుగా జరిపారా? అనే ప్రశ్న వేస్తున్నాయి.