Advertisement
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఆదిలాబాద్ కు చెందిన వంశస్థుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవుడు. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవం నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని వీరు నమ్ముతారు. ఇంతటి ప్రాశస్త్యం గల నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది.
Advertisement
ఆదివారంకేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ జాతరకు వచ్చారు. ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ నాగోబా జాతరకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆదివాసులే.. అటవీప్రాంత యజమానులని చెప్పారు. అటవీ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని.. నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించారు.
Advertisement
తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 8 సంవత్సరాలుగా గిరిజనులను కేసీఆర్ పోడు భూముల విషయంలో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నాగోబా జాతరకు కేంద్ర పర్యాటక గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి వాటిని అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులు ఇవ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్దిని సీఎం అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అర్హులందరికీ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ కు ఇదే చివరి అవకాశమని.. ఇచ్చిన హామీలన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేశారని గుర్తుచేశారు బండి సంజయ్.