Advertisement
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలన, రాచరిక పాలన కొనసాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అందుకే రామరాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళిత బంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement
కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 50వేల ఉద్యోగలకు నోటిఫికేషన్ వేస్తామని మాయమాటలు చెప్పడమే తప్ప ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని దుయ్యబట్టారు బండి. ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చారని, కాళేశ్వరం పేరు మీదే లక్ష కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిపై కూడా అప్పులు మోపిన ఘనత కేసీఆర్ సర్కార్ దేనని విమర్శించారు.
Advertisement
కేసీఆర్ ఏ దేశం గురించి మాట్లాడితే ఆ దేశం దివాళా తీస్తుందని.. చైనా గురించి మాట్లాడితే కరోనా సంక్షోభంతో బిక్కుబిక్కుమంటోందని సెటైర్లు వేశారు. ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని చెప్పారు సంజయ్. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో మనం చూస్తున్నామని.. కేంద్రం సరైన విధివిధానాల వల్లే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని వివరించారు.
ఇక రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. అలాగే.. కేసీఆర్ బర్త్ డే నాడు సచివాలయం ప్రారంభించడం ఏంటని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతులు గుర్తు లేవా? అని ప్రశ్నించారు బండి సంజయ్.