Advertisement
జగిత్యాల ఎమ్మెల్యే తీరుపై మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయోగానీ.. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. తాను ఈ పదవిలో కొనసాగలేనని రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపించారు.
Advertisement
చాలాకాలంగా ఎమ్మెల్యే సంజయ్, భోగ శ్రావణి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ ఉంది. ఇప్పుడది చినికి చినికి పెద్దదై ఇలా దారితీసిందని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే వేధింపులతోనే తాను రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు శ్రావణి. ఆయన మూర్ఖత్వాన్ని మూడేళ్లపాటు భరించానని ఇక తన వల్ల కాదని తేల్చి చెప్పారు. ప్రతీ విషయంలోనూ అవమానాలకు గురి చేశారని వాపోయారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్ అని.. తనపై పెత్తనం అంతా సంజయ్ దేనని తెలిపారు.
Advertisement
అయితే.. తప్పంతా శ్రావణిదేనని కౌన్సిలర్లు మీడియా ముందుకొచ్చారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. శ్రావణి రాజీనామా చేయడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పందించారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేశారని అరోపించారు. బుధవారం మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుందామని అంతా అనుకున్న టైమ్ లో మీటింగ్ కు రాకుండా మీడియా ముందుకొచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ ను దొర అనడం బాధాకరమని.. మూడేండ్లగా ఆయన అందరిని కలుపుకొని వెళ్తున్నారని వివరించారు.
మరోవైపు శ్రావణి విషయంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఎంటర్ అయింది. అధ్యక్షుడు కందగట్ల స్వామి పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ అధినాయకత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పద్మశాలీలు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నారని, ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతర్గత విషయాలు ఎలా ఉన్నప్పటికీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రావణి చైర్ పర్సన్ పదవి నుండి వైదొలిగేలా చేయడం అవమానంగా భావిస్తున్నామని.. కేటీఆర్, కవిత జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.