Advertisement
అధికారమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. భారీ ఏర్పాట్ల మధ్య యాత్ర కొనసాగుతోంది. లోకేష్ కు రక్షణగా 2 వందల మంది ప్రైవేటు బౌన్సర్లు, 4 వందల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా కుప్పం నుంచి లోకేష్ ను అనుసరిస్తున్నారు. పాదయాత్ర కోసం ప్రత్యేక కేరవాన్ వాహనం సిద్ధం చేశారు. విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం ఇందులో అధునాతన ఏర్పాట్లు చేశారు.
Advertisement
కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి అని దుయ్యబట్టారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఉండవు అంటూ చురకలంటించారు. ఏడాదిలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని.. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని అని అడిగారు.
Advertisement
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారన్న లోకేష్.. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని విమర్శించారు. జే ట్యాక్స్ కట్టలేదని పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఫైరయ్యారు లోకేష్. ‘‘జే ట్యాక్స్ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై బై’’ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీకి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని.. కానీ, జగన్ 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శలు గుప్పించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల పనులు చేశానన్న లోకేష్.. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.
యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10 మంది మంత్రులు తనపై మాటల దాడికి దిగారని గుర్తు చేశారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారని.. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశానని వివరించారు. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని.. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. తనను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నానని.. ఈ మూడేళ్లలో మీరు ఏం చేశారని అడిగారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని అన్నారు లోకేష్.