Advertisement
తెలంగాణలో ముందస్తు ఉంటుందనే అనుమానాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కేంద్రం వెంటనే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వస్తే తాము కూడా సిద్ధమని స్పష్టం చేశారు. అప్పుడు అందరం కలిసి ముందస్తుకు వెళ్లొచ్చని చెప్పారు.
Advertisement
నిజామాబాద్ లో పర్యటించారు కేటీఆర్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్ మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పాత కలెక్టరేట్ వద్ద ఇందూరు కళాభారతి భవనానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్ల నిధులతో నిర్మించే ఈ నిర్మాణం.. కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, పిల్లలకు చక్కటి అపురూపమైన కానుకని పేర్కొన్నారు. అనంతరం 21 కోట్లతో నిర్మించిన కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించారు.
Advertisement
బీఆర్ఎస్ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. ఫిబ్రవరి 1వ తేదీన పెట్టబోయే బడ్జెట్ మోడీకి చివరిది అని వ్యాఖ్యానించారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ ను, మంత్రులను తిట్టడమే పనిగా బీజేపీ నేతలు పెట్టుకున్నారని.. వాళ్ల పార్టీ బండారం మొత్తం బయటపడుతోందని చెప్పారు. ఇకనైనా సభ్యతతో మాట్లాడాలని ఎంపీ అరవింద్ ను ఉద్దేశించి మాట్లాడారు. సంస్కారహీనంగా మాట్లాడొద్దని హెచ్చరించారు.
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని అన్నారు. మాటల్లో సబ్ కా సాథ్ అంటున్న కేంద్రం.. చేతల్లో మాత్రం సబ్ కుచ్ బక్వాస్ అని విమర్శించారు కేటీఆర్. ఎనిమిదిన్నరేళ్లయినా రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క రూపాయి నిధులివ్వలేదని.. ఒక్క విద్యాసంస్థ కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. చిత్తశుద్ది ఉంటే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కేటీఆర్ టూర్ సందర్భంగా నిరసన సెగ తగిలింది. కంఠేశ్వర్ చౌరస్తాలో కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వెళ్తుండగా హఠాత్తుగా కాన్వాయ్ కి కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణ వలయాన్ని ఛేదించి కాన్వాయ్ కి అడ్డు వచ్చారు. పోలీసులు వారిని ఆరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.