Advertisement
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. విభజన హామీలు, కృష్ణా జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ లో మౌన దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు 150 మందితో గంటపాటు ఈ దీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ దీక్ష చేస్తున్నట్టు వివరించారు.
Advertisement
జనవరి 31న కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్ క్లబ్ లో సెమినార్ ఇవ్వనున్నట్లు తెలిపారు కోదండరాం. తెలంగాణ ఏర్పడక ముందు ఏ సమస్యలు ఉన్నాయో నేటికీ అవే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత రాష్ట్ర సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని కేసీఆర్ పై మండిపడ్డారు.
Advertisement
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తికావొస్తున్నా నేటికీ ఆస్తుల పంపకాలు, సంస్థల విభజన పూర్తికాలేదని అన్నారు కోదండరాం. ఢిల్లీలో తెలంగాణ , తెలుగు ప్రజలు తమ దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. కృష్ణా నదీ జలాల్లో 170 టీఎంసీలు, 22 శాతం నీటి వాటా మాత్రమే తెలంగాణకు దక్కిందన్న ఆయన.. ప్రస్తుతం ఉన్న నీటివాటాతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడం వల్ల వాటికి అనుమతులు లభించడం లేదని వివరించారు.
అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణం చేయొద్దని కేంద్రం గెజిట్ జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కోదండరాం. సెమినార్ కార్యక్రమానికి యోగేంద్ర యాదవ్ లాంటి చాలామంది వక్తలు వస్తున్నారని.. కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు.