Advertisement
బడ్జెట్ సమావేశాల సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళిసైని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. రాజ్యాంగ పదవిని అవమానిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ అవసరమా? అని ఒకరు.. పార్లమెంట్ లో దీనిపై చర్చించాలని మరొకరు ఇలా.. తమదైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు గులాబీ నేతలు.
Advertisement
గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందని, ఇప్పుడు దాంతో అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. గవర్నర్ ని ఎవరు ఎన్నుకున్నారని రాజకీయలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్ ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని గతంలో మోడీ చెప్పారని గుర్తు చేశారు.
Advertisement
తెలంగాణ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు ఎంపీ కేశవరావు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని అన్నారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు. శాసన సభ, మండలి, గవర్నర్ ఎవరైనా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సూచించారు గుత్తా.