Advertisement
మోడీ సర్కార్ ఈ టర్మ్ కి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. చిన్నా చితక నిధులు తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇరు రాష్ట్రాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం ఇది ప్రజల బడ్జెట్ అని చెబుతున్నారు.
Advertisement
తెలంగాణకు కేటాయించిన నిధులు
– సింగరేణి – రూ.1,650 కోట్లు
– ఐఐటీ హైదరాబాద్ – రూ.300 కోట్లు
– మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు – రూ.1,473 కోట్లు
– రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు – రూ.37 కోట్లు
– మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు – రూ.6,835 కోట్లు
– సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియం లకు – రూ.357 కోట్లు
ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే?
హరీష్ రావు, తెలంగాణ ఆర్థిక మంత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లే. 7 ప్రాధాన్యత రంగాలుంటే వాటిని కేంద్రం గాలికి వదిలివేసింది కేంద్రం. దేశ రైతాంగాన్ని, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్ ఇది. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాటలేదు. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు.
Advertisement
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి సీఎం కేసీఆర్ బాధ్యత కూడా ఉంది. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా.. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఆయన విఫలమయ్యారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు. దాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటి దాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. హైదరాబాద్ లో మిల్లెట్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు.. గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారు.
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అద్భుతమైన బడ్జెట్ ను ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టారు. మోడీ చేసేదే చెప్తారని బడ్జెట్ ద్వారా స్పష్టం అవుతోంది. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా బడ్జెట్ ఉంది. దేశాన్ని, ప్రజలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మంచి బడ్జెట్ ను దేశ ప్రజలకు అందించిన మోడీకి కృతజ్ఞతలు. కర్ణాటక కరువు ప్రాంతంగా చూపారు.. కాబట్టి నిధులు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందా? బీఆర్ఎస్ ముందు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలి.