Advertisement
కొత్త సచివాలయంలో మంటలు చెలరేగడంపై సరైన క్లారిటీ లేని నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇది ముమ్మాటికీ ప్రమాదమేనని.. పనులు త్వరగా పూర్తి చేయాలన్న తొందరలో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కవర్ చేసేందుకే మాక్ డ్రిల్ అంటూ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని మండిపడుతున్నారు.
Advertisement
ఎవరెవరు ఏమన్నారంటే.?
రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
‘‘కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేయడం తప్పు. కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా? అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి. నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా? అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి?’’
Advertisement
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
‘‘భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుట్టినరోజు నాడే నూతన సచివాలయాన్ని ప్రారంభించాలి. నూతన సచివాలయ నిర్మాణంలో ఫైర్ సేఫ్టీ తో పాటు, అన్ని రకాల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ పుట్టినరోజునే నూతన సచివాలయాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాయిదా వేసుకోవాలి. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ప్రమాదం జరిగింది.’’
షర్మిల, వైటీపీ ప్రెసిడెంట్
‘‘కొత్త సచివాలయం నిర్మాణం.. పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది.రూ.11 వందల కోట్లు పెట్టి కట్టిన సచివాలయంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని బయటపడింది. అంతేలే దొర గారు ఏది కట్టినా.. పైన పటారం లోన లొటారమేగా. ఇప్పటికైనా ప్రమాదం ఎందుకు జరిగింది అని అన్వేషించాల్సింది పోయి.. మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు చెప్తే నమ్మే వారు ఎవరూ లేరు. ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయించాలి.’’
కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
‘‘నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు నేను వెళ్తానంటే వద్దన్నారు. సచివాలయం వద్దని తాను అనుకున్నాను. దేవుడు కూడా అనుకున్నాడు. అందుకే సచివాలయం కాలిపోయింది. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరు. అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? కొత్త సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి నాడే ప్రారంభించాలి.’’